మణికొండ కేవ్ పబ్బులో సోదాలు డ్రగ్స్‌ తీసుకున్న 24 మంది అరెస్టు - పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు

 By PULI  AMRUTH 

మణికొండ కేవ్ పబ్బులో సోదాలు నిర్వహించి మాదకద్రవ్యాలు తీసుకున్న 24 మందిని, అరెస్టు చేశామని మదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మత్తుపదార్ధాలు సేకరించిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారని, సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు చేశామన్నారు.

Hyderabad Pub Djs Drugs Case Update : హైదరాబాద్​ మణికొండలోని కేవ్‌ పబ్‌లో టీజీ న్యాబ్‌ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. మణికొండ కేవ్‌ పబ్‌లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో పాటు మరో 24 మంది డ్రగ్స్‌, గంజాయి తీసుకున్నట్టు ప్రాథమిక పరీక్షలో తేలిందన్నారు.

మత్తుపదార్ధాలు సేకరించిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు. కేవ్​ పబ్​లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్ సేకరించినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. 25 మంది పైనా ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. బయట డ్రగ్స్ తీసుకొనే పబ్​లోకి వచ్చారని విచారణలో తేలిందన్నారు.

సోషల్​ మీడియాలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారన్న డీసీపీ, పక్కా సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు చేశామన్నారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్ పబ్​ను సీజ్ చేశామని వివరించారు. ఈ కేసులో పబ్ మేనేజర్ శేఖర్​ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు.

ఐటీ, అమెజాన్ సంస్ధలు వారి సిబ్బందికి డ్రగ్స్ తీసుకోవద్దని అవగాహన కల్పించాలని డీసీపీ కోరారు. తర్వలో మిగిలిన పబ్బుల పైనా సోదాలు చేస్తామని డీసీపీ వెల్లడించారు. గతంలో కూడా ఈ పబ్​లో ఇలాంటి తరహా పార్టీలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పబ్ యజమానులు నలుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మరింత సమాచారం వస్తుందని డీసీపీ తెలిపారు.

Post a Comment

0 Comments